ఆదిపర్వం: నాల్గవ అశ్వాసం: పోస్ట్ - 34

కౌరవవంశ క్రమం : 

భారత వంశానికి కర్త అయిన భరతునకు కైకేయ రాజపుత్రి అయిన సునందకు భుమన్యుడు జన్మించాడు. భుమన్యునకు ధశార్హుడి కుమార్తె విజయకు సుహోత్రుడు జన్మించాడు. సుహోత్రునకు ఇక్షాకుడి పుత్రిక అయిన సువర్ణకు హస్తి అనేవాడు పుట్టాడు. ఇతడి పేరుమీదే హస్తినాపురం అనే నామధేయం ఒప్పారింది. ఇతనికి కేకయ, గాంధారి, ఋక్ష అనే ముగ్గురు స్త్రీలకి బలవంతులైన నూట ఇరవైనాలుగు మంది పుత్రులు జన్మించారు. వీరు వివిధ దేశాలకు రాజులయ్యారు. వీరిలో సందరణుడు సమస్త రాజ్యాలలోనూ శ్రేష్టుడై సూర్యుడు కుమార్తె తపతిని గురువు గారి అనుగ్రహంతో వివాహం చేసుకున్నాడు. వీరికి వంశకర్త అయిన కురు జన్మించాడు. ఇతడి పేరుమీద కురుక్షేత్రం అని పిలవబడింది. ఇతనికి ధశార్హరాజు పుత్రి అయిన శుభాంగికి విధురధుడు పుట్టాడు. ఇతనికి మగధరాజు కుమార్తె సంప్రియకు అవశ్వుడు పుట్టాడు. ఇతడికి మగధరాజ కన్య అమృతకు పరిక్షిత్తు జన్మించాడు. ఇతడికి బాహుదానుడి కుమార్తె సుయాశకు భీమసేనుడు జన్మించాడు. ఇతనికి కేకయరాజు పుత్రిక కుమారీకి పదీపుడు జన్మించాడు. ఇతడికి శిభి కుమార్తె సునందకు దేవాపి, శాంతనవుడు, భాహ్లికుడు అనే ముగ్గురు పుత్రులు జన్మించారు. వీరిలో దేవాపి చిన్నతనంలోనే తపస్సుకై హిమాలయాలకి వెళ్ళిపోయాడు. శాంతనవుడు రాజయ్యాడు. ఇతనికి నది అయిన గంగాదేవికి దేవవ్రతుడైన భీష్ముడు జన్మించాడు. అంతేకాక శాంతనుడికి సత్యవతి అయిన యోజనగంధికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు జన్మించారు. వీరిలో చిత్రాంగదుడు గంధర్వుడి చేతిలో మరణించగా విచిత్రవీర్యుడిని భీష్ముడు పట్టాభిషిక్తుడిని గావించాడు. ఇతనికి కాశీరాజు పుత్రికలు అంభిక, అంబాలిక అనే ఇరువురిని భీష్ముడు వివాహం చేశాడు. సూర్యుని తేజస్సు కలిగిన విచిత్రవీర్యుడు అత్యంత సుందరీమణులు అయిన తన భార్యలమీద నిరంతర రతిభావానికి వశుడై క్షయ వ్యాధి పీడితుడై స్వర్గస్తుడయ్యాడు. అప్పుడు భరతవంశం విచ్చిన్నం అయ్యే స్థితిలో సత్యవతి కుమారుడు, సమస్త ధర్మమూర్తి అయిన వ్యాసుడు దేవతల న్యాయంతో అంబిక యందు దృతరాష్ట్రుడుని, అంబాలిక యందు పాండురాజుని అంబిక చెలికత్తె యందు విదురుడిని పుట్టించాడు. వీరిలో దృతరాష్ట్రుడుకి గాంధారికి వ్యాసుడి వరం వలన దుర్యోధనుడు తో కలిపి నూరుగురు పుత్రులు జన్మించారు. పాండురాజు నియోగించగా కుంతి మాద్రిలకు యముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వని దేవతల వలన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు జన్మించారు. వీరికి ద్రౌపతి భార్య అయినది. ద్రౌపతి వలన ధర్మరాజుకి ప్రతివింధ్యుడు, భీముడికి శ్రుతసోముడు, అర్జునుడికి శ్రుతకీర్తి, నకులుడికి శ్రుతానీకుడు, సహదేవుడికి శ్రుతసేనుడు జన్మించారు. అంతేకాక ధర్మరాజుకి స్వయంవరంలో లభించిన దేవికకు యౌదేయుడు, భీముడికి జరంధరవల్ల సర్వగుడు, అర్జునుడికి సుభద్ర వల్ల వంశాన్ని నిలిపే అభిమన్యుడు, నకులుడికి చేది వంశజురాలైన కరణుమకి నిరమిత్రుదు, సహదేవుడికి స్వయంవరంలో లభించిన విజయకు సుహోత్రుడు జన్మించారు. అంతేకాక భీమసేనుడికి హిడింబకు ఘటోత్కచుడు జన్మించారు. ఈ ఉపపాండవులు పదకొండు మందిలో వంశాన్ని నిలిపిన అభిమన్యుడికి పరిక్షిత్తు జన్మించాడు. సమస్తలోకాలు కీర్తించే ఓ జనమేజయా! నువ్వు పరీక్షిత్తు పుణ్యవతి అయిన మద్రవతికి జన్మించావు. కాగా నీకు వపుష్టమకు శాతానీకుడు, శంకుకర్ణుడు అనే పుత్రులు జన్మించారు. వీరిలో శాతానీకుడు వైదేహికి అశ్వమేధధత్తుడు జన్మించాడు. వీరు ఐలులని, పౌరువులని, భరతులని, కౌరవులని, పాండవులని పిలువబడుతున్నారు.  ప్రసిద్దిచెందారు. ఇది కౌరవవంశ క్రమం. 
అనగా విని జనమేజయుడు వైశంపాయనునితో ఇలా అన్నాడు.
నరవరుడైన శాంతనవునికి నది అయిన గంగకు పొత్తు ఎలా కుదిరింది? మఱియు పాండవులు దృతరాష్ట్ర పుత్రుల పుట్టుపూర్వోత్తరాలు చెప్పుము అనగా వైశంపాయనుడు జనమేజయునకు ఈవిధంగా చెప్పసాగాడు.. 
Next
Previous