ఆదిపర్వం: నాల్గవ అశ్వాసం: పోస్ట్ - 33

దుష్యంతుని చరిత్ర : 

ఇదిగో మనకి పుట్టిన కుమారుడు. ఈ కుమారుడికి పట్టాభిషేకం చేస్తానని మాట ఇచ్చావు. నేను నీభార్య శకుంతలని. వీడు నీకుమారుడు సింహధమనుడు, భరతుడు అని  కణ్వుడు నమదేయాలు పెట్టాడు. వీడిని స్వీకరించు అన్నది. అప్పుడు దుష్యంతుడు! నేను వేటకి వచ్చానా? నిన్ను వివాహం చేసుకున్నానా? అందుకు గుర్తుగా కుమారుడు పుట్టాడా? అసత్యాలు మాట్లాడకు. ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి వెళ్ళు పో అనగానే నన్ను పెళ్ళిచేసుకోలేదు అంటావా? నువ్వు అసత్యం ఆడవచ్చు. నువ్వు అసత్యం ఆడినా సరే సత్యం చెప్పేవారు కొందరు ఉంటారు. మనల్ని ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటారు. మంచి చరిత్ర కలిగిన వాడా! నీ కీర్తి చాలా గొప్పది. ఆ కీర్తికి ఈనాడు మచ్చ తెచ్చుకోకు. ఒక వ్యక్తి ఏమి చేస్తున్నాడో అనే విషయాన్ని 24గంటలు కనిపెట్టేవారు కొందరు ఉన్నారు. వీరు ఎప్పుడు ఏమి చేశారో సాక్ష్యం చెప్పడానికి కొందరిని బ్రహ్మ నియమించాడు. వీటిలో మొట్టమొదటివి వేదములు. వేదములు సాక్షి. ఇవి రాత్రి ఇలా చేశాడు, పగలు ఇలా చేశాడు అని చెపుతాయి. ఇదొక్కటే కాదు. సంధ్యా కాలాలు, పగలు, రాత్రి, ధర్మదేవతా ఇలా ఇన్ని పదార్ధాలు సృష్టించి ఉంచాడు మానవుడుని నిరంతరం కనిపెట్టి ఉండటానికి. పగటి పూట ఏమి చేసిన సూర్యుడు చూస్తాడు. రాత్రి పూట ఏమి చేసినా చంద్రుడు చూస్తాడు. సంధ్యకాలలలో సంధ్యా నటుడు ధూర్జటి చూస్తాడు. పగటిపూట సూర్య కిరణాలు, రాత్రిపూట నక్షత్రాలు మనిషి ప్రవర్తనని వ్రాస్తాయి. వేదములు వీడిని పరీక్షిస్తూ ఉంటాయి. యముడు లాంటి మహా పదార్ధాలు ఉన్నాయి. ఇలా ప్రతిక్షణం మానవుడి కదలికలు సాక్ష్యాలతో సహా రాస్తూ ఉంటే మానవుడు తప్పించుకోగలడా? రేపటి రోజున నువ్వు శరీరం విడిచిపెట్టి వెళ్ళగానే యమలోకంలో యమధర్మరాజు వీడెంచేశాడు అనగానే ఇవన్నీ సాక్ష్యం చెబుతాయి. శకుంతలని మోసం చేశాడు అని చెప్తాయి. అప్పుడు ఘోర నరకం పాలవుతావు. న మాట విను అసత్యమాడకు. అన్నిటికంటే సత్యం చాల ముఖ్యమైన ధర్మం. సాధారణమైన నూతులు చాద వేసి నీరు తొడటాము. చాదతో తోడే నూతులని మాత్రమే నూతులు అంటారు. మంచినీటితో ఉన్న ఇటువంటి నూతులు 100కంటే మెట్లు ఉండి లోపలి దిగి స్త్నానం చేసి, మంచినీరు తాగే దిగుడుబావి ఇంకా మంచిది. ఇది వెడల్పు ఎక్కువ వుంటుంది. నూతులు నూరిటికంటే ఒక్క దిగుడుబావి మంచిది. ఈ బావులు 100కంటే యజ్ఞం మంచిది. అటువంటి యజ్ఞములు 100 చేస్తే ఎంత ఫలం ఉందో అంత ఫలం ఒక్క మంచి కొడుకు ఇస్తాడు. సత్కుమారుడు ఉండాలి. బుద్దిలో, బలంలో, శౌర్యంలో సాటిలేని మేటి అయివుండాలి. అలాంటి ఒక్క కొడుకు వీటన్నికంటే గొప్పవాడు. ఇటువంటి కొడుకులు వందమంది కంటే ఒక సూనృత వాక్కు మేలు. (సత్యం గొప్పది). 100మంది మంచి కొడుకులు ఎంత ఫలితం ఇస్తారో ఒక్క సత్యవాక్కు అంతకంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది. 100అశ్వమేధయాగాలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఆ పుణ్యాన్ని ఒకత్రాసులో ఒక పక్క ఉంచి మరో పక్క ఒక్క సత్యవాక్కు ని ఉంచితే ఆ త్రాసు ముల్లు సత్యం వైపే మొగ్గుతుంది. అంత గొప్పది సత్యం.  సత్యం కంటే తపస్సులేదు, సత్యంకంటే ధర్మంలేదు. అన్నిటికంటే సత్యం గొప్పది. సత్యం కాపాడినట్టుగా ఈ సృష్టిలో మరేది కాపాడలేదు. ఈ సత్యమే జగత్తుని నడిపిస్తుంది. ఈ సత్యం వల్లనే రేయింబవళ్ళు నడుస్తున్నాయి. ఈ సత్యం వల్లనే సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఈ సత్యం వల్లనే సకాలంలో మేఘం వర్షిస్తుంది.  సర్వ వేదాలు చదివితే ఎంత పుణ్యమో, సకల తీర్ధాలు సేవిస్తే ఎంత పుణ్యమో, ఆ పుణ్యాలు ఇటువంటివి ఒక సత్యానికి సాటిరావు. కాబట్టి సత్యం పలుకు. అసత్యమాడకు. నువ్వు నన్ను వివాహం చేసుకున్నవని ఒప్పుకొని నీ కుమారుడిని దగ్గరికి తీసుకో. ముత్యాలహారం మేడలో వేసుకుంటే చల్లగా ఉంటుంది. అంతకంటే కొడుకుని కౌగలించుకుంటే హాయిగా ఉంటుంది. వేసవికాలంలో చల్లగా ఉండటంకోసం కర్పూరం పొడి వంటిమీద చల్లుకంటారు. దీనివల్ల శరీరం చాల చల్లగా ఉంటుంది. కొడుకుని కౌగలించుకుంటే అంత చల్లగా ఉంటుంది. దేహానికి చందం పూసుకుంటే ఎంత హాయి కలుగుతుందో కొడుకుని కౌగలించుకుంటే అంత హాయి కలుగుతుంది. వెన్నెలలో తిరిగితే ఎంత హాయిగా ఉంటుందో  హాయికంటే ఎక్కువ కొడుకుని కౌగలించుకుంటే. కాబట్టి కొడుకుని దగ్గరికి తీసుకో అన్నది శకుంతల. అయినా నాకు నువ్వెవరో తెలియదు అన్నాడు దుష్యంతుడు. ఇలా వాదోపవాదాలు జరుగుతుండగా హటాత్తుగా ఆకాశవాణి! దుష్యంత మహారాజా ఈ కుమారుడు ఎవరనుకుంటున్నావు? నీకు శకుంతలకి జన్మించినవాడు. నేను సాక్షం పలుకుతున్నాను అని ఆకాశవాణి పలికింది. వీడిని చేరదీయి. భవిష్యత్తులో నీకు నీవంశానికి పేరు తెచ్సిపెడతాడు. నీకు ఈ శకుంతలకి జన్మించిన ఈ కుమారుడిని కాదని అసత్యమాడి తప్పించుకోలేవు. దీనికి నేనే సాక్ష్యం అనగానే పైనుండి పూలవర్షం కురిసింది. దుష్యంతుడు కూడా సింహాసనం నుండి దిగివచ్చి! ఈవిడని నేను రహస్యంగా వివాహం చేసుకున్నాను. కానీ ఇప్పుడు హటాత్తుగా ఈమెను లోనికి రాణించి కుమారుడికి పట్టాభిషేకం చేస్తే పరస్త్రీని ఆదరించానని నిందవేస్తారని అసత్యమాడాను. ఇప్పుడు ఆకాశవాణి సాక్ష్యం ఇచ్చింది కనుక శకుంతలని, కొడుకుని స్వీకరిస్తున్నాను క్షమించండి అని స్వీకరించాడు. కుమారుడు భరతుడికి పట్టాభిషేకం చేశాడు. శకుంతలని భార్యగా స్వీకరించి సకలభోగాలు అనుభవించి గృహస్థాశ్రమం వదలి వానప్రస్థం స్వీకరించి తపస్సు చేసి దేహాన్ని వదిలాడు. భరతుడు సర్వభూమండలాన్ని ఏకచత్రాధిపత్యం సాగించి ఎన్నో యజ్ఞాలు,యాగాలు, క్రతువులు నిర్వహించి ప్రజలని బిడ్డల్లా పరిపాలించాడు. పండితులని గౌరవించాడు. విప్రులని ఆదరించాడు. భారత వంశానికి కర్త అయ్యాడు. 
అందుకని ఎప్పుడూ ధర్మాన్ని అనుసరిస్తే అది ఏదో ఒక రూపంలో నిన్ను కాపాడి తీరుతుంది. శకుంతల ధర్మ పరివర్తన కలిగినది  ఆ ధర్మదేవత సరైన సమయంలో సాక్ష్యం ఇచ్చి రక్షించినది. అందుకే ధర్మో రక్షతి రక్షితః! ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. (ఈ సామెత ఇక్కడ పుట్టిందే). రక్షితః ధర్మః రక్షతి. రక్షించబడిన ధర్మం తప్పక రక్షిస్తుంది. నువ్వు ఎవరినో కాపాడితే రక్షింప బడినవారు ఏదో ఒక సమయంలో రక్షిస్తారు. ధర్మాచరణ చేస్తే అది కాపాడుతుంది. అధర్మం చేస్తే అది నాశనం చేసి తీరుతుంది. 
Next
Previous