ఆదిపర్వం: నాల్గవ అశ్వాసం: పోస్ట్ - 31

దుష్యంతుని చరిత్ర

      శకుంతల కూడా అపార సహజ శరీర హావభావాలు కలిగి, ఇంద్రుడు కుమారుడైన జయంతునితో పోల్చదగిన సౌందర్యంతో దుష్యంతుని తెలుసుకొని ఆదరగౌరవాలతో ఆసనం, అర్ఘ్యం, పాద్యం మొదలైన అతిధి సత్కార్యాలు చేసి పూజించి క్షేమాలు తెలుసుకుని ఉండగా దుష్యంతుడు! వినోదంగా వేట వేడుకకి వచ్చిన నేను కణ్వ మహామునిని దర్శించుకుని పోదామని వచ్చాను. వారు ఎచటికి పొయినారు? అని దుష్యంతుడు అడుగగా! అపుడు శకుంతల! యజ్ఞం నిమిత్తం వేరొకచోటికి వెళ్ళినారు. వెనువెంటనే మీరాక తెలిపినచో వచ్చెదరు అని పలుకగా ! ఆ వయ్యారి తియ్యని మాటలకు ఆమె కన్యయని గ్రహించి మన్మధుని రాజ్యలక్ష్మి వలే శుభములతో కూడుకున్న శరీరావయవములు గల ఆమె సౌందర్యాన్ని గని నీవు ఎవ్వరి కూతురవు?  ఇటువంటి అపూర్వ రూపాన్ని, లావణ్యాన్ని, సహజ శరీర హావభావ గుణాలు గల సుందరివి ఈ ఆశ్రమానికి ఏ కారణం చేత వచ్చావు?అని అడిగాడు! నేను కణ్వ మహాముని కూతురుని అని శకుంతల తెలియజేసింది.  అప్పుడు దుష్యంతుడు! అపార ధర్మమే రూపం దాల్చిన వాడని ప్రజలు తనని ప్రశంసిస్తుండగా లోకపూజ్యుడైన కణ్వ మహామునికి కూతురు ఎలా అయింది? శకుంతల ముని కన్యయే అయిన ఎడల నా మనస్సు ఈమె యందు ఎందుకు ఘాడంగా లగ్నమైంది? నేను ఈమె మాట నమ్మలేకున్నాను. అని యదార్ధం తెలుసుకోనుటకై! పద్మనేత్రవైన శకుంతలా!చతుర్విధాశ్రమాల్లో ఉత్తమమైన సన్యాసాశ్రమాన్ని నిష్టతో పాటించి ఇంద్రియాలని నిగ్రహించిన కణ్వమహామునిది కళంకం లేని చరిత్ర. అటువంటి కణ్వుడికి నీవు ఎలా కూతురువి అయినావు?ఆసంగతి నాకు చెప్పుము అనగా అప్పుడు శకుంతల! కణ్వుడు ఒకనాడు ముని శ్రేష్ఠులు ఇదే మాట అడుగగా అది నేను విన్నాను. ఇప్పుడు మీకు ఎరిగించెదను, ఆలకింపుము! మహాముని విశ్వామిత్రుడని ఒక ముని ఉన్నాడు. కటోర దీక్షతో లక్షల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ తపస్సు ప్రభావంతో జగత్తంతా దద్దరిల్లిపోయింది. అయన శిరస్సు నుండి అగ్ని జ్వాలలు లేచాయి. ఆ అగ్ని జ్వాలలు లోకాలన్నీ తగలబెట్టేస్తుంటే తట్టుకోలేక ఇంద్రుడు! ఈ విశ్వామిత్రుడు తపస్సు చేసి నా ఇంద్రపదవి ఎక్కడ లాక్కుంటాడో అనే భయంతో ఈయన తపస్సు చెడగొట్టడానికి అప్సరసలలో ఉత్తమమైన మేనక అనే అప్సరసని పిలిచి ఓ అప్సరసా శిరోమణి! నువ్వు వెళ్లి నీ సౌందర్యంతో, నీ లావణ్యంతో, నీ నాట్యంతో, నీ గానంతో  ఆ విశ్వామిత్రుడి తపస్సుభంగపరుచు అన్నాడు. అప్పుడు మేనక! విశ్వామిత్రుడికి కోపం వస్తే కుల పర్వతాలు బ్రద్దలవుతాయి, అడుగున ఇసుక మిగిలి సముద్రాలు ఇంకిపోతాయి. గిరగిర తిరిగే గాలి కూడా జంకుతుంది, ఉగ్రస్వభావంతో అతిశయించే ఆకోపరుడి సమీపానికి భామలు ఎవ్వరైనా పోయి ఎదుట నిలువగలరా? వశిష్టుడి 100 మంది పుత్రులని చంపిన కోపిష్టి అతను. అతను కోపించి శపిస్తే నిలువగలనా? అనగానే ఇంద్రుడు చిరు మందహాసం చేసి.. నీ సౌందర్యం ఎవ్వరినైన ఆకట్టుకుంటుంది. ఆసంగతి నేను ఎరుగకపోలేదు. విశ్వామిత్రుడిని అవలీలగా సంసారం బంధంలోకి లాగ గలిగే అద్భుత లావణ్య మూర్తివి. సందేహించకు నేనున్నాను అని అభయం ఇచ్చి పంపించాడు.
   దక్షిణ దిక్కునుండి వీచే చల్లని మలయమారుతం ఆ మేనక కొప్పులోని సువాసనల చేత, ఆమె మేనిపైపూతల అమితంగా పరిమళించి ఆ మునిశ్రేష్టుడు విశ్వామిత్రుడి మేనిపై విడువకుండా వీచి, దేవకాంత అయిన మేనక నూతన పూల అలంకారాల విలాసంతో, మెల్లమెల్లగా వనంలో విహరించే కోరికతో కులుకుతూ నడచివచ్చి మహామునులలో శ్రేష్టుడు, ఇంద్రుడి మనస్సులో భయం పుట్టించే గొప్ప తపస్సు చేయడంలో నియమిత మనస్సు కలవాడు, మన్మధభావాలు జయించినవాడు అయిన విశ్వామిత్రుడుని చూచింది. పద్మనేత్ర అయిన మేనక విశ్వామిత్రుడికి నమస్కరించి ప్రీతితో పూనుకునే నెపంతో చెలికత్తెలతో తానూ విహరిస్తూ మేనక అలసభావం తోపగా మునిశ్రేష్టుడి ముందుగ నిలబడింది. మంచి సువాసనతో కూడిన గాలివలన కోమలి పైట వంగి తొలగింది. అప్పుడు ఆమె పెద్దవైన వృక్షోజాలు, కోమలి సన్నని మెరిసే కడుపుమీద మూడు ముడతలతో కూడిన నూగారు బయటపడ్డాయి. విశ్వామిత్రుడు తన పైటలో మేనక మేని సౌందర్యాలు చిక్కుకోవడం చేత మన్మధుడు వేసిన వాడి బాణాలు మిక్కుటంగా తన హృదయంలో నాటగా నిగ్రహం కోల్పోయి వలపు తమకంతో మేనక పొందుకోరాడు. మేనక విశ్వామిత్రుడి కోర్కెకు తగినట్టు మన్మధక్రీడలు అనేక రోజులపాటు సాగించింది. అలా కొన్నాళ్ళు గడిచిన తరువాత వీరికి శకుంతల జన్మించింది. ఆ పసికందుని అక్కడే ఉన్న ఇసుక తిన్నెలపై ఉంచి మేనక స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయాడు. అలా ఒంటరిగా ఉన్న ఆపాపని శకుంతములు అనే కొన్ని పక్షులు పెంచాయి. శకుంతములు పెంచడం వల్ల శకుంతల అనే నామధేయం ఏర్పడింది. అదిగో ఆపిల్లని నేను. ఒకనాడు అడవిలో ఉన్న నన్ను అటుగా వెళ్తున్న కణ్వుడు చూసి ఏ క్రూరజంతువు అయినా నన్ను తినేస్తుందేమో అని ఇక్కడికి తీసుకొచ్చి పెంచాడు. కణ్వుడు పెంచడం వల్ల (సంరక్షించడం వల్ల) అయన నాకు తండ్రి అయ్యాడు. విశ్వామిత్రుడు మేనక నా కన్న తల్లితండ్రులు అనగానే హమ్మయ్య అనుకున్నాడు. (ముని కూతురు అనగానే గౌరవభావం వస్తుంది కాని వ్యామోహం కలుగకూడదు. అలా వ్యామోహం కలగడం వల్ల సందేహం వచ్చి నివారణ చేసుకున్నాడు. అందుకే మనస్సు కొందరిని చూడగానే వరిస్తుంది. కొందరిని చూడగానే విభేదిస్తుంది). క్షత్రియ పుత్రిక అవ్వడం వల్లనే వ్యామోహం కలిగింది అని గ్రహించుకున్నాడు. సుందరి నిన్ను చూచిన మొదలు మనస్సు నీమీదే లగ్నమైనది. బ్రాహ్మము, ప్రాజాపత్యము, గాంధర్వము, రాక్షసము, పైశాచికము, ఇత్యాది అష్ట విధాల వివాహములు శాస్త్రములలో చెప్పారు. వీటిని అష్టవిధ వివాహవిదులు అంటారు. ఇందులో గాంధర్వ వివాహం క్షత్రియులకి చాలమంచిది. ఇక్కడ మంత్రం తంత్రాలు ఉండవు, కేవలం పాణిగ్రహణం చేసి వివాహం చేసుకున్నాను అని పంచభూతాల సాక్షిగా శపదం చేస్తే వివాహం అయిపోయినట్టే. పూలదండ వేసిన వివాహమయినట్టే. కనుక నిన్ను వివాహం చేసుకుంటాను అనగానే శకుంతల! నాకు కూడా ఇష్టమే కాని ఒక మాట ఇస్తే ఒప్పుకుంటాను అంది. సరే చెప్పు అన్నాడు. అప్పుడు శకుంతల! నాకు పుట్టే కుమారుడిని సర్వంసహా రాజుని చేస్తాను అని మాట ఇస్తే వివాహానికి అంగీకారమే అంది. పంచభూతాల సాక్షిగా నీకు మాట ఇస్తున్నాను అన్నాడు. అయన మాట ఇచ్చాడు. తక్షణం వివాహం చేసుకున్నాడు.. 
Next
Previous
Click here for Comments

2 comments:

avatar

looking for more posts...

avatar

శకుంతల ముని కన్యయే అయిన ఎడల నా మనస్సు ఈమె యందు ఎందుకు ఘాడంగా లగ్నమైంది?