ఆదిపర్వం: నాల్గవ అశ్వాసం: పోస్ట్ - 30

దుష్యంతుని చరిత్ర

      అలా వేటకు మందరగిరి వైపు అరణ్యంలోకి వెళ్ళాడు. అక్కడ శర్దులాలు(8కాళ్ళ జంతువులు), సింహాలు, పెద్ద పులులు, పులులు, ఇలా క్రూరతి క్రూరమైన జంతువులని వేటాడుతూ అలుపెరుగని వేగంతో మూలాన నక్కిన జంతువులని, దూరదూరంగా పారి పోతున్న జంతువులని కూడా అత్యంత చాకచక్యంగా సంహరించాడు. అలా వెళ్ళగా వేటలో అలసి నది సమీపాన సేదతీరుతుండగా అక్కడ ఒక అద్భుత నందనవనం గోచరించినది. అదిచూసి పులకిత శరీరుడై ఆ ఉద్యానవనంలోకి ప్రవేశించగానే నల్ల నల్లని తుమ్మెదలు రెక్కల జుంకారాలతో, మెత్తమెత్తని మాటలతో ఆశీర్వాదాలు ఇస్తూ మందగమన గాలులచేత రాల్పబడిన పూవులనేడి అక్షతల సమూహాన్ని తలంబ్రాలుగా చల్లినట్లు భాసించాడు. దట్టమైన అడవిలో వేటవేడుకలో పరిగెత్తే మృగాలను విరామం లేకుండా వెంటాడి వేటాడటం చేత అలసివున్న దుష్యంతుడు బడలిక తీరేటట్లు, మనసులో తాపం తగ్గేటట్లు ఆ నదిపై వీచే చల్లని గాలులు అతనిపై వీచాయి. పొడవుగా పెరిగి చిగురించిన ఎర్రని గోరంటచెట్లు, గుబురుగా పూలు పూచిన మంచి అశోక చెట్లు, సురపొన్నలు, పొన్నలు, మొగలిపొదలు, చక్కగా విరగకాచి పండిన మామిడి పండ్లు, అరటిచెట్ల గుంపులు, చిలుకల పలుకులు, కోయిలల మృదుమధుర స్వరాలు, చెవులకు పండువుగా వింటూ చాలా దూరం వెళ్ళగా యజ్ఞ హవిస్సులైన నేతుల సువాసనలు గల పొగలతో చూరిన తీగలను అల్లుకుని పూలులేని కొమ్మలపై వాలిన తుమ్మెదల గుంపులను చూసి ఆ ప్రాంతంలో తపొవనమున్నదని, దగ్గరలో దివ్య మునీంద్రుని యొక్క నివాసమున్నదని దుష్యంతుడు మనసులో తెలుసుకున్నాడు. ఆవిధంగా దుష్యంతుడు హృదయానికి ఆహ్లాదం కలిగించే ఆ వనంలోకి ప్రవేశించి వెళ్ళగా ఉత్తమ విప్రుల వేదనాదాలు, అర్ధశాస్త్ర నిపుణులు అయిన పండితులు, వేదార్ధ విచారణ, యజ్ఞాలు నిర్వహించే ఋత్విక్కులు, వేదవిహిత కర్మలు అనుసరించే నిష్టాపరులు, మహా తపోనిధులు, నివాస ప్రదేశమై గంగానది తీరంలో ఉన్న నరనారాయణులు నివశించే ప్రదేశంవలే పుణ్యనదీ తీరంలో సుందరంగా శోభిల్లుతూ లోకాన్ని పవిత్రం చేస్తున్న కణ్వ మహాముని ఆశ్రమాన్ని చూచాడు. చెవులకి ఇంపుగా చిలుకలు సామవేదాన్ని సస్వరంగా పాడే పద్దతిని ఆశక్తితో తన్మయత్వంతో కదలకుండా వింటున్న ఏనుగులు, ఏనుగుల తొండాల నీడలో తొండాల నీటి తుంపరలలో సుఖంగా ఉన్న సింహాలను, బ్రాహ్మణులు భూతబలులు తెచ్చి వివిధ ప్రదేశాలలో ఉంచిన అన్నపిండాలని తినాలని వేగిరపడుతూ కలిసి మెలిసి తిరుగుతున్న ఎలుకలు, పిల్లులున్నూ, తమ మధ్య సహజంగా ఉన్న వైరాన్ని మరచి కలిసిమెలిసి మసలే వాటి స్నేహప్రవృత్తిని చూచి ముని మహిమకు ఏంతో ఆశ్చర్యపడి తన వెంట వచ్చిన వారిని కశ్యప ప్రజాపతి వంశీయుడు అయిన కణ్వమహామునిని దర్శించి వస్తాను, వచ్చేవరకు వేచి ఉండండని పలికి మంత్రుల్ని, వెంట వచ్చిన ఆశ్వికులకు నియమించి వెళ్లి కణ్వుని నివాసంలో సన్నని మేను కలిగినది, తామరపూల రేకులవంటి విశాల కన్నులుకలది, ఒత్తుగా గుముగూడిన తుమ్మేదలవలె నల్లని ముంగురులు కలది అయిన శకుంతలని చూశాడు.
Next
Previous
Click here for Comments

3 comments:

avatar

post it fast!!

avatar

too good blog... naaku chala nachindhi.. daily following for new posts..

avatar

chala baagundhi ee blog.. nenu roju follow avuthunnanu...