ఆదిపర్వం: రెండో అశ్వాసం; పోస్ట్ - 16


జనమేజయుడి సర్పయాగం: 1
ఇది జరిగిందని మంత్రులు చెప్పారు. అపుడు ఉదంకుడు! మహారాజ నేను ఎందుకు పిత్రుద్రోహివి అన్నానో తెలిసినదా? మీ తండ్రి గారు కేవలం శాపం వలన మరణించలేదు. తక్షకుడు కాటువేస్తే బ్రతికించడానికి వస్తున్న కస్యపుడి కి  సంపద ఆశ చూపి వెనక్కి పంపించేశాడు. మా గురువుగారికి సేవ చేయకుండా నన్ను ఎడిపించాడు, నీ వంశాన్ని నాశనం చేశాడు. ఇలాంటి వాళ్ళు ఉంటే ప్రమాదం. కాటువెస్తే వేశాడు కాని బ్రతికించడానికి వచ్చే వాడిని చెడకొట్టి వెనక్కి పంపాడు. ఇటువంటి దుర్మార్గుడిని క్షమించకూడదు. ఆ దుర్మార్గుడిని, వాడి బంధువులని నాశనం చేయాలి. వాడు విషాగ్ని జ్వాలతో మీ తండ్రి గారిని దగ్ధం చేశాడు. మనం యజ్ఞాగ్ని ద్వార వాడిని దగ్ధం చేద్దాం. వెంటనే సర్పయగానికి ఏర్పాట్లు చేయించు. అనగానే జనమేజయుడు! మహా ఋషులు ఎవరైతే ఉన్నారో వారందరిని పిలిపించండి అన్నాడు.

జనమేజయుడి పిలుపు అందుకుని కౌండిల్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్తుడు, కపిలుడు, వేదవ్యాసుడు, సౌనకుడు, అక్షపాదుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, ఉత్సుడు, బృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దూర్వాసుడు,
బహుడు, వ్యగ్రపాధుడు, మాండవ్యుడు ఇలాంటి ఎంతోమంది మహా మహులు, హేమాహేమీలు అయిన ఋషులు ఎక్కడెక్కడినుంచో జనమేజయ మహారాజు పిలిచాడంటూ ఆప్యాయతతో వచ్చారు. అందరికి ఆసనాలు ఇచ్చి కూర్చోబెట్టి ఓ మహానుభావులైన ఋత్విక్కులారా! నేను ఈ ఉదంకుడుని ప్రధాన ఋత్విక్కుగా పెట్టుకొని మా తండ్రిగారిని అన్యాయంగా చంపిన తక్షకుడిని, వాడి బాంధవులని నాశనం చేయడానికి యజ్ఞం చేయాలనుకుంటున్నాను. పురాణాలలో కానీ, ఇతి హసలలో కాని, వేదాలలో, వేదాంగాలలో ఈ సర్పయాగ విధానం ఉందా? ఉంటే చెప్పండి అనగానే. ఋత్విక్కులు నవ్వి ఈ ప్రపంచంలో  ఎక్కడా లేదు. కాని ప్రత్యేకించి నీకోసమే కొన్ని  పెట్టారు. ఇది నీకోసమే! ఇంతకుముందు ఎవరూ చేయలేదు, ఇక ముందు భవిష్యత్తులో ఎవరు చెయ్యలేరు. కేవలం నీకోసమే కొన్ని పురాణాలలో ఈ సర్పయాగం ఎలాచేయాలో చెప్పారు. నువ్వు చేస్తావని తెలుసు. ఇది నీకోసమే పుట్టింది. అందుకే పరిక్షిత్తు మరణించడానికి దేవతలు సంకల్పం చేశారు. (ఇది కృతయుగంలో కద్రువ ఇచ్చిన శాపం కలియుగ ఆరంభంలో జరిగింది. మద్యలో త్రేతా ద్వాపరయుగాలు దాటి కద్రువ ఇంతదూరం ఆలోచించింది.) అది మాకు తెలుసు.
యజ్ఞగుండం ఎంత వైశాల్యమ ఉండాలో, ఎక్కడ ఏ శాల ఉండాలో వాస్తు ప్రకారం మేము నిర్మిస్తాం. కావలసిన ధనం అంతా సిద్ధం చెయ్యి. యజ్ఞం ఆరంభిద్దాం అనగానే వేదవ్యసుడుకి జనమేజయుడు నమస్కరించి తాతా నువ్వు యజ్ఞాన్ని పర్యవేక్షించండి అని భాద్యత అప్పగించాడు. జనమేజయుడికి భార్యలలో కాశి రాజు పుత్రిక వుపుష్టమ తో కలిసి యజ్ఞానికి సిద్దం అయ్యాడు. భార్యలేకపోతే యజ్ఞానికి పనికిరాడని శాస్త్రం. అందునా ఇది కమ్య యజ్ఞం(కోరికతో చేసే యజ్ఞం). ఒక శుభ ముహూర్తంలో యజ్ఞం ప్రారంభించబోయే ముందు ఒక ఋత్విక్కు వచ్చి మహారాజ వాస్తు అంతా బాగానే ఉంది. కాని ముహూర్తంలో ఉన్న చిన్న దోషంవల్ల ఎంతో దిగ్విజయంగా ప్రారంభమైన యజ్ఞం మధ్యలోనే ఆగిపోతుంది అన్నాడు. అప్పుడు జనమేజయుడు! ఏది ఎలా జరగాలని ఉందో అలా జరుగుతుంది. మొదలు పెట్టకముందే చూసుకోవాలి. మొదలుపెట్టాక ఆలోచించకూడదు. ఆపద వచ్చినపుడు ధైర్యంగా ఉండాలి. సంపద ఉన్నపుడు వినయంతో ఉండాలి. కాదని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నాశనం తప్పదు. పుష్కల వాక్చతురత ఉండాలి. యుద్ధరంగంలో పరాక్రమం చూపించాలి. కీర్తి పొందడానికి ప్రయత్నించాలి. అంతకంతకీ విద్యని ఇంకా పెంచుకోవాలి. ఇవి పుట్టుకతో వచ్చే లక్షణములు. ప్రారంభించిన తరువాత ఆగే అవసరంలేదు. ప్రారంభించండి. ఏమైతే అది అవుతుంది అన్నాడు.
యజ్ఞం ప్రారంభం అయ్యింది. తెల్ల పాములు, నల్ల త్రాచులు, భూడిద వర్ణంలో ఉన్నవి, గోధుమ వర్ణం కలవి, పాములు, పింగల వర్ణం, ఎరుపు తెలుపు కాకుండా ఉన్నవి, పసుపు, అకుపచ్చ, పింగల, పిసంక. ఇలాంటి రకరకాల పాములు ఋత్విక్కులు ఒక్కో మంత్రం చదువుతుంటే ఎక్కడెక్కడి నుంచో ఆకాశ మర్గాన వచ్చి గిరగిరా తిరిగి యజ్ఞ గుండంలో పడి సురసురలాడుతూ మలమలా మాడి భూడిదైపోతున్నాయి. అవి పడగానే వచ్చె వాసనకి వీళ్ళు దానిమీద నేయ్యిపోస్తున్నారు. ఈ విధంగా యజ్ఞం ఆరంభమయింది.
Next
Previous