ఆదిపర్వం: రెండో అశ్వాసం; పోస్ట్ - 17

జనమేజయుడి సర్పయాగం: 2
 జనమేజయుడు చేస్తున్న సర్పయాగం గురించితెలిసి తక్షకుడు స్తంభించిపోయాడు. భయకంపితుడై వెంటనే ఇంద్రుడు దగ్గరికి వెళ్లి ఆ యజ్ఞం నాకోసమే చేస్తున్నారు. నన్ను రక్షించు రక్షించు  రక్షించు బాబోయ్. అనగానే ఇంద్రుడు! నువ్వేమి భయపడకు మిత్రమా వాళ్ళు చదివే మంత్రాలకి భూమి మీద ఉండేవి, పాతాళలోకం లో ఉండేవి చనిపోతాయి కాని స్వర్గం వరకు రావు. ఇంకా నీకు భయం కలిగితే నా సింహాసనాన్ని చుట్టుకుని ఉండు అన్నాడు. హమ్మయ్యా అనుకుని సింహాసనానికి చుట్టుకుని హాయిగా ఉన్నాడు.
ఇక్కడ యజ్ఞం జరుగుతుంది. లక్షల సంఖ్యలో పాములువచ్చి యజ్ఞగుండంలో పడుతున్నాయి.  జనమేజయుడికి అనుమానం వచ్చి పనికిమాలిన పాములు లక్షలు చస్తే మనకేమిటి. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలని శాస్త్రం. నేను ఎవడిమీద ద్వేషంతో, క్రోధంతో ఈ యజ్ఞాన్ని సంకల్పించానో ఆ దుర్మార్గుడు తక్షకుడు రాడేం అన్నాడు. ఆ ఋత్వికులు మేము మంత్రాలు చదువుతున్నాం కాని తక్షకుడు మాత్రం రావడం లేదు అనగానే మీ మంత్రాలు వాడిమీద పనిచేయవా? అన్నాడు. ఋత్విక్కులు నవ్వి పనిచెయ్యకపోవడం కాదు, మేము దృష్టి పెట్టిన చోట ఎక్కడ తక్షకుడి జాడ కనపడటం లేదు అని కళ్ళు మూసుకుని దివ్యదృష్టితో మొత్తం 14 లోకాలు చూశారు. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళ లోకాలు చూడగా స్వర్గలోకంలో ఇంద్రుడు సింహాసనానికి చుట్టుకుని ఉన్న తక్షకుడు కనిపించాడు. మహారాజ దొరికాడు ఆ దుర్మార్గుడు, స్వర్గలోకంలో ఇంద్రుడు సింహాసనానికి చుట్టుకుని ఉన్నాడు. అక్కడ ఉన్నంతవరకు వీడిని కదిలించడం కష్టం అనగానే ఐతే మీ మంత్రాలు కదిలించాలేవా? అన్నాడు. అలాకాదు ఇప్పుడు చదువుతున్న మంత్రాలు కదిలించలేకపోతున్నాయి. ఇప్పుడు చూడు అని '' సహేంద్ర తక్షకాయ స్వాహా'' (ఇంద్రుడితో సహా తక్షకుడు ఈ గుండంలో పడిపోవుగాక!) అన్నారు. వెంటనే తక్షకుడు చుట్టుకుని ఉన్న సింహాసనం తో సహా పెళ్లగించుకుని పైకి లేచింది. ఆ సంఘటనకి ఇంద్రుడికి భయం వేసింది. ఓరి దుర్మార్గుడా నిన్ను కాపాడాలి అనుకుంటే నేను కూడా నాశనం అయ్యేలా ఉన్నాను. తప్పించుకోడానికి లేకుండా పోయింది అని ఇంద్రుడు కూడా గజగజా ఒణికిపోయాడు. ముచ్చెమటలు పట్టేసాయి. హడాలిపోయాడు. సింహాసనం గిర గిరా తిరుగుతూ యజ్ఞగుండం దగ్గరికి వెళ్ళిపోతుంది.
ఈలోపు వాసుకి జగత్కారువు దగ్గరికి వెళ్లి నీ కుమారుడు ఆస్తికుడిని పంపించు. సర్పయాగం ఆపడానికి పుట్టాడు. ఇప్పడు వాడిని పంపకపోతే ఆ యజ్ఞంలో తక్షకుడు పడిపోతున్నాడు. వాడితోపాటు స్వర్లోకాధిపతి దేవేంద్రుడు కుడా పడిపోతున్నాడు అనగానే జగత్కారువు! నాయన ఆస్తికా! నువ్వేం చేస్తావో తెలిదు ఇంద్రుడు, తక్షకుడు యగ్నగుండంలో పడేలోపు ఆ యజ్ఞాన్ని అపు వెళ్ళు అన్నది. వెంటనే ఆస్తికుడు తల్లికి నమస్కరించి అక్కడ మాయమై యజ్ఞం జరిగే ప్రదేశంలో ప్రత్యక్షమయ్యాడు. (ఏదైనా మంచి పని మీద ఎక్కడికైనా వచ్చినపుడు మంచివ్యక్తిని పొగిడితే (తప్పక పొగడాలి) త్వరగా పని అవుతుంది అని ఈ సన్నివేశం చెపుతుంది.).

మహానుభావుడు అయిన జనమేజయుని దగ్గరికి వచ్చి ఓ పరీక్షిన్ నరేంద్ర పుత్రా! నువ్వు
విఖ్యాతికి ఎక్కినవాడివి. నీ మహిమ, నీ తపస్సు, ప్రజలు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. నువ్వు సామాన్యుడివా? చంద్రవంశానికి ఆభరణానివి. రాజువై ఉండి కూడా ఋషివి కాబట్టి నిన్ను రాజర్షి అన్నారు. అసూయా ద్వేషాలు లేని పవిత్ర మనస్కుడివి నువ్వు. దానం చేయడంలో నిన్ను మించిన వారు లేరు. ధర్మం తప్పకుండా ప్రజలని పరిపాలిస్తావ్. అందుకే నిన్ను పూర్వులు అయిన ధర్మరాజుతో పొగిడారు. (అందరూ చనిపోయి స్వర్గానికి వెళితే  సూర్యవంశం పుట్టిన హరిశ్చంద్రుడు, చంద్రవంశంలో పుట్టిన ధర్మరాజు మాత్రమే బొందితో స్వర్గానికి వెళ్ళారు. ఇంకా రాజులలో ఎవ్వరు స్వర్గానికి వెళ్ళలేదు. త్రిశంకుడు అనే రాజు ప్రయత్నించాడు కాని త్రిశంకు స్వర్గానికి మాత్రమే వెళ్ళాడు.) అంతటి ధర్మరాజుతో సమానుడివి. పూర్వం ఇక్ష్వాక వంశంలో నబాహుడు అనే రాజు ఉన్నాడు. ధర్మం కోసం కన్న పుత్రులనే దానం చేశాడు. అంతటి వాడివి నువ్వు. గంగను తెచ్చిన భగీరధుడు అంతటి గొప్పవాడివి. పుత్రకామేష్టి యాగం చేసిన దశరధుడు అంతటి గొప్పవాడివి.  పూర్వం దశరధుడు ఆస్థానంలో ఉన్న పండితులు , మహారాజా మీనరాశిలో శని ప్రవేసిస్తున్నాడు కనుక 12వర్షములు కరువు వస్తుంది.  అందువల్ల అనవసరంగా నీ మీద అభాండాలు వచ్చి పడతాయి. ప్రజలు కరువుతో నశించిపోతారు. అని చెప్పగానే గురువైన వశిష్టుడి సహాయంతో దివ్యరధం సంపాదించి సప్తర్షి మండలం దాటి శని ఉన్న గ్రహం లోని శని వద్దకు వెళ్లి ఏయ్ శని! నువ్వు మినరాశిలో ప్రవేశించి ప్రజలని పీడించ బోతున్నావట! నిన్ను వదిలిపెట్టను. మీనంలో ప్రవేశించకుండా నిన్ను నాశనం చేస్తాను అని ధనుస్సు ఎక్కుపెట్టాడు. శని నవ్వి నాయనా మేము గ్రహలం, శివుడి అనుగ్రహంతో గ్రహలం అయ్యాం. మమ్మల్ని అలా ద్వంసం చెయ్యకూడదు. చెయ్యాలేవ్. మీ ప్రజలకోసం సప్తర్షి మండలాలు దాటి వచ్చావు కనుక నిన్ను మెచ్చుకున్నాను. ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు శనిని 12శ్లోకాలతో దశరధుడు కీర్తిస్తాడు. ఇవి పద్మపురాణంలో ఉంటాయి. ఈ శ్లోకాలని ఏలిన నాటి శని ఉన్నవారు పటిస్తే శని ప్రభావం తగ్గుతుంది. పెద్ద ప్రమాదంలో ఉన్నవారికి చిన్న ప్రమాదంతో పోతుంది. లేదంటే శని ఒక ఊపు ఊపేస్తాడు. ఈ శ్లోకాలు చెప్పగానే శని మెచ్చుకొని ఎం వరం కావాలో కోరుకో అన్నాడు. నువ్వు మీనరాశిలో ప్రవేశిస్తే 12ఏళ్ళు కరవు వస్తుందన్నారు. న రాజ్యానికి ఆ ప్రమాదం రాకుండా చూడు అనగానే! సరే ఈ 12శ్లోకాలు పటిస్తే నీ రాజ్యానికి ఆ దోషం రాదు. రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అన్నాడు శని.అంత గొప్ప సాహసం చేశాడు.) అదిగో అలాంటి వాడివి నువ్వు, మాంధాత అనే రాజు ఉన్నాడు. ఏకంగా ఇంద్రుడితో యుద్ధం చేశాడు. రావణాసురుడుని ఓడించాడు. రావణుడిని ఓడించిన వారిలో వాలి, కార్తవీర్యార్జునుడు, ఈ మాంధాత, బలిచక్రవర్తి కుమారులలో పెద్దవాడు అయిన బాణాసురుడు వున్నారు. వారిలో మంధాతని తట్టుకోలేక రావణుడు స్నేహం చేశాడు. నవనాసురుడు చంపాడు మంధాతని శివుడు శూలంతో!  ఆనాడు రావణుడిని గడగడలాడించిన మాంధాత వంటివాడివి నువ్వు.  ఇక రామచంద్రుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, అటువంటివాడివి నువ్వు. సద్గుణాలలో అర్జునుడి అంతటివాడివి నువ్వు. నిన్ను నేను ప్రసంసిస్తున్నాను అన్నాడు. సరే కావాలో కోరుకో అన్నాడు జనమేజయుడు.. ఆడినమాట తప్పకూడదు. వెంటనే ఈ యజ్ఞం ఆపేయ్ అన్నాడు. పక్కనే ఉన్న ఋషులు కూడా ఇటువంటి మహానుభావులు వచ్చి అడిగిన మాట కాదంటే దోషం. యజ్ఞం ఆపెయ్యి అన్నాడు. జనమేజయుడు సరే తదాస్తు అని యజ్ఞం ఆపేశాడు. ఇలా యజ్ఞం ఆపేయగానే అప్పటికి వచ్చింది ఇంద్రుడి సింహాసనం. గిర్రున తిరుగుతుంటే తక్షకుడు విషం కక్కుకుంటున్నాడు. ఇంద్రుడికి నోటివెంట లాలాజలం లాలాజలం వస్తుంది. ఒణికిపోతున్నాడు ఇంద్రుడు. ఆ ఇంద్ర సింహాసనం రావడం చుసిన ఆస్థికుడు వెంటనే వెనక్కి వెళ్ళిపో అన్నాడు. తక్షకుడితో సహా సింహాసనం వెనక్కి వెళ్ళిపోయింది. 
జనమేజయుడు అక్కడినుండి సభామందిరంలోకి ప్రవేశించి సింహాసనం మీద కూర్చుని ఆలోచిస్తుండగా వ్యాసమహర్షి తన శిష్యులతో అక్కడికి వచ్చాడు. జనమేజయుడు చూసి సమయానికి వచ్చారు. ఆ యజ్ఞం ఆగిన దగ్గరనుంచి మనశ్శాంతి కరువైంది. ఎందుకు మొదలైందో , ఎందుకు ఆగిందో అంతా నాకు తెలియకుండానే జరిగిపోయింది. యజ్ఞం ఆగితే ఆగింది కాని, ఎవరిగురించి ఆ యజ్ఞం చేశామో ఆ తక్షకుడు చావలేదు. మనస్సంతా అశాంతితో నిండిపోయింది. ఏదైనా కథ చెప్పు తాత అన్నాడు.


ఆస్థికుడి చరిత్ర, తక్షకుడి విషాగ్ని జ్వాలలో పరీక్షిత్ దగ్ధం కావడం, జనమేజయుడి యజ్ఞం అర్ధంతరంగా ఆగిపోవడంతో రెండవ ఆశ్వాసం పూర్తి అయింది.
ఫలస్మ్రుతి: ఆస్తికుడు చరిత్ర విన్నా, చదివినా సర్పగండాలు ఉండవు. ఒకవేళ ఏమైనా సర్పగండాలు ఉంటే తొలగిపోతాయి.
Next
Previous